పెళ్లి ముడి



ఝామ్మున పెళ్లయిపోయింది. వధూవరులిద్దరూ హనీమూన్ బయలుదేరుతున్నారు. పెళ్లి కూతురు తల్లి కుమార్తె చేతిలో ఓ బ్యాంక్ పాస్ బుక్ పెట్టి చెప్పింది.

‘సంసారం అన్నాక కష్ట సుఖాలు వుంటాయి. నీకు బాగా సంతోషం కలిగిన రోజున ఎంతో కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చెయ్యి. ఆనందం కలిగించిన కారణాన్ని కూడా అందులో గుర్తుగా రాసుకో. పుస్తకం పారేసుకోకు. చెప్పింది మరచిపోకు’
గిర్రున ఏడాది తిరిగింది. పండంటి బాబు పుట్టాడు. ఆ సంతోషానికి గుర్తుగా కొంత డబ్బు డిపాజిట్ చేసింది.
నెలలు గడిచాయి. ఆమెకు జీతం పెరిగింది. పెరుగుతున్నఖర్చులకు తోడుగా జీతం పెరగడం కంటే ఆనందం ఏముంటుంది. దానికి గుర్తుగా మరికొంత సొమ్ము బ్యాంకులో చేరింది. మరి కొన్నాళ్ళకి అతడికి ప్రమోషన్. రెట్టింపు జీతం. కారు కొన్నారు. మంచి జరిగినప్పుడల్లా బ్యాంక్ డిపాజిట్ పెరుగుతూనే వుంది.
రోజులన్నీ ఒక్క మాదిరిగా వుండవు కదా.

కాపురంలో చిర్రుబుర్రులు మొదలయ్యాయి. సంభాషణల్లో అనురాగాల పాలు తగ్గి వాదాలు చోటుచేసుకోవడం ప్రారంభమయింది.
ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి. ఎప్పుడన్నా నోరు తెరిచినా అది చివరకు నోరు పారేసుకోవడం దాకా వెళ్ళేది.తల్లిదగ్గర కుంది.

‘ఇతగాడిని భరించడం ఇక నా వల్లకాదు. నేను విడాకులు తీసుకుంటాను మమ్మీ. అతడు కూడా వొప్పుకున్నాడు. ఇష్టం లేని పురం కన్నా విడిపోయి విడిగా వుండడమే హాయి’విన్న తల్లి గుండె గతుక్కుమంది. అయినా తమాయించుకుని చెప్పింది.
‘నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా చెప్పు. అలాగే విడాకులు తీసుకుందురు కాని. కానీ నీ పెళ్ళిలో నీకొక బ్యాంక్ పాస్ బుక్ ఇచ్చాను కదా. అందులో యెంత వేసారో ఏమిటో. ముందు ఆ డబ్బు బయటకు తీసి ఒక్క పైసా మిగలకుండా అంతా ఖర్చుచేసేయ్యి. ఎందుకంటే ఈ దాంపత్యం తాలూకు ఏవీ నీకు గుర్తులుగా మిగిలి వుండకూడదు.’
అమ్మాయి పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది. క్యూలో నిలబడివున్నప్పుడు అనుకోకుండా పుస్తకం తెరిచి చూసింది. అందులో డిపాజిట్ చేసింది తక్కువసార్లే అయినా ఆ ఎంట్రీల వద్ద రాసిపెట్టిన జ్ఞాపకాలు ఆమెను కదిలించాయి. పిల్లవాడు పుట్టడం, జీతాలు పెరగడం, ప్రమోషన్ రావడం – ఆ సందర్భాల్లో తమ నడుమ చోటుచేసుకున్న ఆహ్లాదకర క్షణాలు – ఓహ్ – జీవితమంటే యెంత ఆనందం.

ఇక అక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి భర్తతో చెప్పింది. 'ఇదిగో. ఈ పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళు. ఎంతవుంటే అంత తీసేసుకుని అంతా ఖర్చు చేసెయ్యి. ఆ తరవాతే ఇంటికి రా’
మర్నాడు వచ్చాడు. వచ్చి భార్య చేతిలో పాస్ బుక్ పెట్టాడు. అందులో కొత్త డిపాజిట్ వుంది. దానికి కింద ఇలా రాసాడు.
‘ఈ రోజు నా జీవితంలో గొప్పరోజు. నిన్ను నేను ఎంతగా ప్రేమించిందీ, ఇన్నేళ్ళ దాపత్యంలో నువ్వు నాకెంత సంతోషాన్ని అందించిందీ అన్నీ ఈ రోజే మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను.’
ఎవరు ముందో తెలియనంత వేగంగా వారిద్దరూ ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నారు. ఆనంద భాష్పాలతో వారి కాపురం పునీతమైంది.

తరువాత వారు చేసిన మొట్టమొదటి పని – బ్యాంకు పాస్ బుక్ ను భద్రంగా బీరువాలో దాచిపెట్టడం.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.