పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?

ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.

కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు
. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?

కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?

"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు
.
అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!

అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.
తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.

కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.