భగవద్గీత ప్రాధాన్యతేమిటి?


భగవద్గీత చాలా మందికి ఒక ఆధ్యాత్మిక గ్రంధం మాత్రమే కాదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే పాఠ్య గ్రంధం కూడా. భగవద్గీతలోని సారాంశాన్ని సులభంగా లక్షల మందికి చేరుస్తున్న ప్రముఖుల్లో బ్రహ్మకుమారి ఉషా బెహన ఒకరు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ఉషా బెహన్‌ను ‘నివేదన’ పలకరించింది. 

ఈ ఆధునిక యుగంలో భగవద్గీత ప్రాధాన్యతేమిటి? 

భగవద్గీత అందరిది. అన్ని కాలాలది. అన్ని వయస్సుల వారిది. ప్రతి రోజూ మనం అనేక సంఘర్షణలకు లోనవుతూ ఉంటాం. ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాం. స్కూలుకు వెళ్లే పిల్లవాడి దగ్గర నుంచి ఇంట్లో పని చేసుకొనే మహిళ దాకా అందరికి ఏవో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటిలో కొన్నింటికి తాత్కాలికమైన పరిష్కారాలు ఉంటాయి. కొన్నింటికి దీర్ఘకాలంలో లభించే పరిష్కారాలుంటాయి. భగవద్గీతను జాగ్రత్తగా చదివితే ఈ పరిష్కారాలు, వాటి కోసం అనుసరించాల్సిన మార్గాలు తెలుస్తాయి. దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటుంది. కృష్ణుడంతటి వాడు పాండవుల పక్షంలో ఉంటాడు. స్వయానా దేవుడే తమ పక్షాన ఉన్నా- అర్జునుడిలో తీవ్రమైన సందిగ్ధత ఉంటుంది. ఏం చేయాలో తెలియని చిత్రమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. అప్పుడు కృష్ణుడు అతనికి కర్తవ్య బోధ చేస్తాడు. దీనినే మన జీవితాలకు అన్వయించుకుందాం. ప్రతి రోజూ మనం కురుక్షేత్రం లాంటి ఈ ప్రపంచంలో యుద్ధం చేస్తూ ఉంటాం. మనపై అనేక ఒత్తిళ్లు ఉంటాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో భగవద్గీత చెబుతుంది.

దీనిని మన దైనందిక జీవితంలో ఎలా అన్వయించుకోగలం? 
మనకు ఒక సమస్య ఎదురయిందనుకుందాం. దానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని కనుగొంటే పరిష్కార మార్గం అన్వేషించటం సులభమవుతుంది. భగవద్గీతలో కర్మ యోగము, జ్ఞాన యోగము, సాంఖ్య యోగము మొదలైనవి ఉంటాయి. వీటిలో అపారమైన జ్ఞానం ఉంది. ఒక సమస్య ఎలా పుడుతుంది? దానికి పరిష్కార మార్గమేమిటి? అనే విషయాలు దీనిలోనే దాగి ఉన్నాయి. బుద్ధుడు, వివేకానందుడు వంటి మహాపురుషులందరూ దీనిని గ్రహించారు. వీరు బోధించినవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అంత ఎందుకు.. ప్రపంచంలో ఏ మతాన్నైనా తీసుకోండి. దానిలోని ప్రాథమిక సూత్రాలు భగవద్గీతలో ఉంటాయి. 


ఉదాహరణకు మహాత్మ బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గం మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. జీసస్‌ చెప్పిన ప్రేమతత్వం కనిపిస్తుంది. మహ్మద్‌ ప్రవక్త బోధించిన మంచి-చెడుల మధ్య పోరాటం జిహాద్‌ కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే- భగవద్గీత జ్ఞానామృతం.

భగవద్గీత నేటి యువతకు ఏం చెబుతుంది? 



జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని మనం అధిగమిస్తూనే ఉండాలి. సమస్యలను అధిగమించే క్రమంలో ఒత్తిడికి లోనవుతాం. కొన్ని సార్లు తప్పు దోవ పడతాం. దీనికి అనేక కారణాలుండచ్చు. ఒత్తిడి ఉండకూడదనుకోవటం కానీ.. సమస్యలు రాకూడదనుకోవటం కానీ అవివేకం. ఈ విషయాన్ని భగవద్గీత చాలా సున్నితంగా చెబుతుంది. అంతే కాకుండా సామాన్యమైన వారు అసామాన్యులుగా ఎలా మారవచ్చనే విషయాన్ని వివరిస్తుంది.

సామాన్యులు- అసామాన్యులుగా ఎలా మారతారు? 

మనను మనం తెలుసుకుంటే చాలు. వివేకానందుడు మనలాంటి సామాన్యమైన వ్యక్తే. ఆధ్యాత్మిక మార్గంలో తనను తాను తెలుసుకోగలిగాడు. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. వయస్సుతో పాటు పరిణితి వస్తుంది. ఈ పరిణితి వల్ల ప్రయాణం సులభమవుతుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే- మనను మనం ప్రక్షాళన చేసుకుంటూ మంచి ఆలోచనలతో ప్రయాణం సాగిస్తే సామాన్యులు- అసామాన్యులుగా మారతారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. జ్ఞానం, విజ్ఞానం రెండూ వేర్వేరు. ప్రాపంచిక జ్ఞానాన్ని సాధించిన వారు అసామాన్యులు కాలేరు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించిన వారే అసాధారణ వ్యక్తులు కాగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన విలువలు మారవు. అన్ని కాలమానపరిస్థితులకు అతీతం.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.