అక్షింతలు - పరమార్థము

మన ఆచార వ్యవహారాల్లో , సంస్కృతీ సంప్రదాయాల్లో అక్షింతలకు ముఖ్యమైన పాత్ర ఉంది. శుభకార్యాలల్లో, దైవ కార్యాల్లో అక్షింతలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పిల్లలకి సంబంధించిన వేడుకల్లో వాళ్ల తలపై పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. వివాహ సమయంలో వధూవరుల తలపై అందరూ అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేస్తుంటారు. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. పెళ్లి శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడం మన సంప్రదాయంలో భాగం.
ఇక గురువులు, పీఠాధిపతులు కూడా తమ దర్శనార్ధం వచ్చిన వారి తలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. ఇక దైవసన్నిధిలో కూడా అంతే, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. ‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’. క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెబుతారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దాన వస్తువు బియ్యం. మనస్సుకు చంద్రుడు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణం, తల్లి, వ్యసనం.. ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుంది.

మానవుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము. పెద్దలు వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షింతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షింతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం.

మరో సిద్ధాంతం ప్రకారం.. మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు 24 ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అక్షింతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకంటే.. ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షింతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
భగవద్గీతలో 
‘అన్నాద్భవన్తి భూతాని’ అని భగవద్గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షింతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షింతల్లో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.

పసుపు కలిపిన అక్షింతలు 

బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే బియ్యం, మనం మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందుతారు. ఇందుకే మన పూర్వికులు, ఆశీర్వచనానికి మహాశక్తి ఉంటుంది.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.