గీత చదువుకో రాత మార్చుకో


భగవద్గీత అంటే ఏమిటి?

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.

☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.

☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.

☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.

☆ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. 

ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.

☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?

-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.

-కర్తవ్యం గురించి చెబుతుంది.

-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.

- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. 

పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. 

-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. 

స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.

-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. 

-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.

-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో
రాత మార్చుకో

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.