నారదులవారు ఎవరు?


నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు, విష్ణు భక్తుడు, దేవర్షి అని అందరికీ తెలిసినదే. ఆయన అనుగ్రహమే ప్రాతిపధికగా వాల్మీకి, వ్యాస మహర్షులు రామాయణ, భాగవతాది ఉత్కృష్ట రచనలు మనకు అందిచారు. నారదుడు అన్న పేరు గల వారు, పురాణేతిహాసాలలో ఏడుగురు కనిపిస్తారు.
బ్రహ్మ యొక్క మానస పుత్రుడు
పర్వతుడు అనబడే ఋషియొక్క మామగారు
వసిష్ఠుని భార్య ఐన అరుంధతికి సోదరుడు; లేదా సత్యవతి అనే ఆమెకు భర్త
ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మొదట జగడాలకు తెర తీసినా, చివరికి అది లోక కల్యాణం వైపుకు దారి తీసేట్టు చేయువాడు
కుబేరుని సభాసదుడు
శ్రీరామచంద్రుని సభలో ఉన్న ఎనిమిది మంది ధర్మశాస్త్రవిదులలో ఒకడు
జనమేజేయుని సర్ప యాగం సదస్యులలో ఒకడు
ఇంతకీ అసలు నారదులవారు ఎవరు?
భగవంతుడు స్వయంగా ఎలా అవతరిస్తుంటారో, అలాగే కారణ జన్ములైన మహాపురుషులు కూడా లోకములో అప్పుడప్పుడూ అవతరించి ఆ భగవంతుడి లీలల కొరకు కావలసిన రంగాన్ని సిద్ధం చేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అలాంటి మహాపురుషులు అవిద్య, అహంకారము, మమకారములవంటి వికారాలు లేని ముక్త పురుషులై ఉండి కూడా, ముక్తులుగా కాక లోకంలోని జీవుల మధ్యలో తిరుగాడి వారి కల్యాణంకొరకై పాటుపడుతుంటారు. ప్రధానమైన భగవద్ అవతారం సంభవించినపుడు వీరి కార్యభారము పెరిగిపోతుంటుంది. వీరివలన జరిగే కార్యాలన్నీ భగవంతుడి కార్యాలే! అలాంటి మహాపురుషులలో, దేవర్షి నారదుడు ఒకరు. అన్ని యుగాలలో, అన్ని లోకాలలో, ప్రతీ శాస్త్రంలో, అన్ని సమాజాలలో, అన్ని పనుల్లో నారదునికి ప్రవేశమున్నట్టు తెలుస్తోంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరలలోనే కాక, ఈ ఘోర కలికాలంలో సైతం ఆయన ఉన్నట్టు; అర్హతగల భక్తులకు ఆ మహాభాగుని దర్శనం లభిస్తుంటుందని పెద్దలు చెబుతుంటారు.
అన్ని శాస్త్రాలలో మహాపండితుడు, సమస్త తత్త్వపరిజ్ఞాత, వ్యాఖ్యాత అయి ఉండీ, నారదుడు భక్తిమార్గాన్నే ప్రవర్తిల్ల చేసినట్టు తెలుస్తున్నది. వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు, శుకయోగి, ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి మహానుభావులకు భక్తి మార్గంలో మార్గ దర్శకత్వం చేసినది ఈయనే కదా!
ఇంతకీ ఈయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం – స్వయంగా ఈయనే వ్యాసమహర్షికి తెలియజేసారు. రెండు కల్పాలకు సంబంధించిన చరిత్ర శ్రీమద్భాగవతంలో కనబడుతుంది.
దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాసమహర్షి, లోక కల్యాణార్థమై వేదములను నాలుగు భాగములుగా విభాగించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని – ఎన్నో ఆఖ్యాన, ఉపాఖ్యానాలతో లోకాలకు అందించాడు. పురాణాలను రచించాడు. ఐనా తృప్తి కలుగక పరిపూర్ణ శాంతిని పొందలేదు. ఏదో తక్కువ ఐనట్టు వ్యథ చెందుతున్నప్పుడు, నారద మహర్షి అక్కడికి చేరుకొంటారు. తన పరిస్థితిని తెలియజేసి నివారణోపాయాన్ని వ్యాసుడు తెలియజేయమని కోరుకుంటాడు. అప్పుడు నారదులవారు, తన అన్ని రచనలలో ధర్మాలను వివరించిన విధంగా, (అంటే ధర్మబోధయే ప్రధాన లక్ష్యం) భగవంతుని కీర్తిని కీర్తించలేదు కాబట్టి తనకు అలా వెలితిగా తోస్తున్నదని తెలియజేసి, తన పూర్వ వృత్తాంతాన్ని తెలిపి, వ్యాసుడిని శ్రీమద్భాగవత రచన చేయవలసినదిగా సెలవిస్తారు. అలా నారదుల వారు వ్యాసుడికి తెలిపిన తన వృత్తాంతం…
MUST READ :మహలయ అమావాస్య అంటే......?
మహానుభావా! నేను గడిచిన కల్పంలో గత జన్మంలో – ఒక దాసీ పుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇండ్లలో పని చేస్తూ ఉండేది. నేను ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొని ఆ మహానుభావులకి పరిచర్య చేసే వాణ్ణి.
ఓ పుణ్య చరిత్రా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోడిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధమూ, పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి. నేనా వేదవేత్తలు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి. ఎండనీ వాననీ లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారు మాటాడకుండా వారి ఆజ్ఞలు నెరవేర్చేవాణ్ణి.
ఈ ప్రకారంగా వర్షాకాలమూ, శరత్కాలమూ గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణమూ ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే శబ్దాలు అమృత రసప్రవాహాలై నాకు వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికీ స్వస్తి చెప్పి భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించడం ఆరంభించాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి, బ్రహ్మ స్వరూపుణ్ణీ అయిన నా యందు, స్థూలమూ సూక్ష్మమూ అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితం అని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులైనారు.
ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధీంచినందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతులైనారు. ఎంతో సంతోషంతో, ఎంతో కారుణ్యంతో ఎంతో వాత్సల్యంతో అతిరహస్యమూ, అమోఘమూ అయిన ఈశ్వరజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. నేనుకూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావం తెలుసుకున్నాను. ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం. లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పొగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితే కానీ ఆ రోగం శాంతించదు.
ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆసక్తులౌతారు.
ఓంకారపూర్వకంగా వాసుదేవ – ప్రద్యుమ్న – సంకర్షణ – అనిరుద్ధ నామాలు, నాలుగూ భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు. నేను ఈ విధంగా ప్రవర్తించినందువల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి నారాయణ మూర్తికి తెలుసు. వ్యాస మహర్షీ! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు.
మునులలో అగ్రేసరుడవు. ఎంతో ఎరుక కలవాడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతాలకు శాంతి లభించేటట్లు నీవు చక్కగా వాసుదేవుని యశోగాథలను సంస్తుతించు. ఈ విధంగా నారదమునీంద్రుడు తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించి, వ్యాసముని నారదుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు.

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.